.

28, మార్చి 2011, సోమవారం

గంగపుత్రుల...జీవన చిత్రం

నేడు నూటికి తొంభై ఐదు సినిమాలు కమర్షియల్‌ పంథాలోనే వస్తున్నాయి. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు ప్రధానంగా కోరుకునేది కొత్తదనం, వినోదం. ఈ రెండింటినీ కొలబద్దలేసి కృత్రిమంగా చూపిస్తున్న నేటి సినీ వాతావరణంలో సహజసిద్ధమైన 'సొంతవూరు' మట్టి వాసనను దర్శకుడు పి.సునీల్‌కుమార్‌ రెడ్డి మరోసారి చూపాడు. ఆయన తీసిన 'గంగపుత్రులు' ఓ ఊరి జీవన చిత్రం. రాపిడ్‌ ఇండిస్టియలైజేషన్‌, అభివృధ్ది పేరుతో వస్తున్న ఎకనామిక్‌ జోన్లు, స్థానిక ప్రజలపై పడుతున్న ప్రభావం గురించి ఒక్కసారి ఆలోచించమని దర్శకుడు చెప్పదల్చుకున్న పాయింట్‌. శ్రీకాకుళం జిల్లా, సోంపేట సంఘటనతో సినిమా మొదలవుతుంది. పంట పొలాలు కోల్పోయి, కాలుష్యం బారిన పడే అలాంటి అభాగ్యుల మానసిక క్షోభను దర్శకుడు తెలపాలనుకున్నాడు. బిగ్‌స్టార్స్‌, బిగ్‌ ప్రొడక్షన్‌...ఇవేవీ లేకుండా కథను నమ్ముకుని తీసిన సినిమా ఇది. ఇన్ని కోట్లతో తీశాం, ఇన్ని కోట్ల మార్కెట్‌ చేస్తుంది అనే కోణంలో కాకుండా, వాస్తవిక కథను, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయమని చూపటం మెచ్చదగింది. తీసిన నిర్మాతలు వై.రవీంద్రబాబు, కిషోర్‌ బసిరెడ్డిని ప్రశంసించకుండా ఉండలేం. మంచి చిత్రాల కోసం ఎదురు చూసేవారు తప్పక చూడాల్సిన సినిమా...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి