.

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ముకీల నాటి మహా నిర్మాత.. నటుడు హిమాంశురారు!

ప్రస్తుతం ముంబరులో ఎంతో అనాకర్షణీయంగా ఉన్న పారిశ్రామిక స్థలం అది. ఆ స్థలాన్ని చూస్తే, ఒకప్పుడు అక్కడ ఓ చక్కటి సినిమా స్టూడియో ఉండేదనీ, ఎన్నో మంచి చిత్రాలు అక్కడ తయారయ్యాయనీ ఎవరూ ఊహించలేరు. ఆ ఫిల్మ్‌ స్టూడియో పేరు - 'బాంబే టాకీస్‌'. దాని అధినేత - హిమాంశు రారు. సినిమా పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, చేసిన నిర్విరామ కృషి కారణంగానే అక్కడ ఆ స్టూడియో వెలసింది. భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన హిమాంశు రారుని స్మరిస్తూ, మహాకవి శ్రీశ్రీ ''తురాయి కంటె ఆ / కు రాయి కంటె, కీ / చు రాయి కంటె - హిమాం / శు రాయి గొప్పవాడు'' అని 1940లోనే అన్న మాటలు సుప్రసిద్ధం.........
హిమాంశు రారు సమకాలంలోనే చాలా మంది ఔత్సాహికులు సినీ రంగంలోకి వచ్చారు. ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారు. అయితే, వాళ్ళలోని చాలా మందికీ, హిమాంశు రారుకీ ఓ తేడా ఉంది. వారిలో చాలా మంది అనుకోకుండా సినీ రంగంలోకి వచ్చిపడితే, హిమాంశు రారు మాత్రం అలా కాకుండా, ఏరి కోరి సినీ రంగాన్ని ఎంచుకున్నారు. భారతదేశంలో సినిమా రంగం శైశవ దశలో ఉన్నప్పుడే, ఈ రంగానికి ఎంతో భవిష్యత్తు ఉందని ఆయన ముందు చూపుతో గ్రహించారు.
చదువుకొనే రోజుల్లోనే సినిమాల పట్ల ఆసక్తి
హిమాంశు రారు తూర్పు బెంగాల్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌)లో ఢాకా సమీపంలోని ఓ గ్రామంలో ఓ సంపన్న బెంగాలీ కుటుంబంలో 1892లో జన్మించారు. ఆయన బి.ఏ. పూర్తయిన తరువాత న్యాయశాస్త్ర విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. ఆ తరువాత న్యాయవిద్యను కొనసాగించడం కోసం లండన్‌లోని ఇన్నర్‌ టెంపుల్‌లో చేరారు. మొదటి నుంచి కళల పట్ల, ముఖ్యంగా రంగస్థల కళల పట్ల ఆసక్తి ఉన్న ఆయన అలా లండన్‌లోని నాటక సమాజాల వైపు ఆకర్షితులయ్యారు. అక్కడ కొన్ని నాటకాలలో ఆయన చిన్నా చితకా పాత్రలు ధరించారు. కొంతమంది రంగస్థల ఔత్సాహికులను ఓ జట్టుగా ఏర్పరిచి, నాటకాలు ప్రదర్శించేవారు. ఆ సందర్భంలోనే ఆయనకు లండన్‌లో ఉంటున్న భారతీయ నాటక రచయిత నిరంజన్‌ పాల్‌తో పరిచయమైంది. ఆ స్నేహం పదిహేనేళ్ళ పాటు కొనసాగింది.

అలా కలిసిన నిరంజన్‌ పాలే తరువాతి రోజుల్లో హిమాంశు రారుకి స్క్రిప్ట్‌ రచయిత అయ్యారు. వారిద్దరూ కలసి మూడు మూకీ చిత్రాల రూపకల్పన చేశారు. అవి - 'లైట్‌ ఆఫ్‌ ఏషియా' (1926), 'షిరాజ్‌' (1928), 'ఎ త్రో ఆఫ్‌ డైస్‌' (1930). ఈ మూడు చిత్రాలలోనూ రారు స్వయంగా నటించారు. దర్శకుడు ఫ్రాంజ్‌ ఓస్టెన్‌ నేతృత్వంలోని జర్మనీ బృందం ఆ సినిమాలను చిత్రీకరించింది. కాగా, ఈ మూడు భారతీయ మూకీ చిత్రాలూ జర్మన్‌, బ్రిటీషు సంస్థలు సహ - నిర్మాతలుగా రూపొందినవే కావడం విశేషం.
అంతర్జాతీయ భాగస్వామ్యంలో తొలి భారతీయ చిత్రం
అప్పట్లో హిమాంశు రారు తీసిన మూకీ చిత్రం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది - 'ది లైట్‌ ఆఫ్‌ ఏషియా' (లేదా 'ప్రేమ్‌ సన్యాస్‌') చిత్రం. మన దేశంలో ఇంకా టాకీలు రాని రోజులవి. హిమాంశు రారుకి ఉన్న ఓర్పు, అవతలి వాళ్ళను ఒప్పించే నేర్పు కారణంగా ఈ చిత్రం తయారైంది. ఆ చిత్ర నిర్మాణం కోసం హిమాంశు రారు చాలా కృషే చేశారు. 1924 తొలి రోజుల్లో ఆయన ఏకంగా జర్మనీలోని మ్యూనిచ్‌ నగరానికి వెళ్ళి, అక్కడి సుప్రసిద్ధ చిత్ర నిర్మాత పీటర్‌ ఆస్టెర్‌మెయెర్‌ను కలిశారు. అలా ఆ ఏడాదే ఆ చిత్ర నిర్మాణం మొదలైంది. ఢిల్లీకి చెందిన గ్రేట్‌ ఈస్ట్రన్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థ ఈ చిత్రానికి భారతీయ నిర్మాతగా వ్యవహరించింది. 'లైట్‌ ఆఫ్‌ ఏషియా' చిత్రం భారతీయ మూకీ చిత్రాల చరిత్రలో మరపురాని ఘట్టం.

ఆ చిత్రంలో హిమాంశు రారు, సీతాదేవిగా ప్రాచుర్యం పొందిన ఆంగ్లో - ఇండియన్‌ నటి రెనీ స్మిత్‌ ఆ చిత్రంలో నటించారు. అప్పట్లో ఆ చిత్రం ఐరోపాలో విస్తృత స్థాయిలో వాణిజ్య విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. అయితే, మన దేశంలో మాత్రం సరైన ప్రచారం లేకపోవడంతో ఆశించినంతగా ఆడలేదు. 1925లో విడుదలైన అత్యుత్తమ చిత్రాల్లో 'ది లైట్‌ ఆఫ్‌ ఏషియా' ఒకటని లండన్‌కు చెందిన 'టైమ్స్‌' పత్రిక ప్రశంసించింది.
అభిరుచులు కలసిన రారు - దేవికా రాణి
ఆ తరువాత కొద్ది కాలానికే 'షిరాజ్‌' (1928), 'ఎ త్రో ఆఫ్‌ డైస్‌' ('ప్రపంచ పాశ్‌') (1930) అనే మరో రెండు మూకీ చిత్రాలను హిమాంశు రారు నిర్మించారు. బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ ఫిల్మ్‌ ్స, హిమాంశు రారు, జర్మనీకి చెందిన సుప్రసిద్ధ యు.ఎఫ్‌.ఏ. స్టూడియోస్‌ కలసి ఈ చిత్రాలు తీశారు. తాజ్‌ మహల్‌ నిర్మాణం వెనుక ఉన్న విషాదభరిత ప్రేమకథను 'షిరాజ్‌' చిత్రం తెరకెక్కించింది. ఆ సమయంలోనే లండన్‌లో నిరంజన్‌ పాల్‌ ఇంట్లో దేవికా రాణితో రారుకు పరిచయం కలిగింది. ఆ పరిచయం ప్రేమగా, చివరకు పరిణయంగా మారింది. 1929లో రారు, దేవికా రాణి పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాతే 'ఎ త్రో ఆఫ్‌ డైస్‌' చిత్ర నిర్మాణం సాగింది.

ఆ రెండు చిత్రాలూ విజయం సాధించడంతో, హిమాంశు రారు తగినంత చొరవ, వనరులు ఉన్న నట - నిర్మాతగా స్థిరపడ్డారు. నిర్మాణానంతర పనులన్నీ బెర్లిన్‌లోని యు.ఎఫ్‌.ఏ. స్టూడియోస్‌లో జరిగేవి. ఫలితంగా అక్కడకు వెళ్ళి, నిర్మాణంలోని మెలకువలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం హిమాంశు రారుకీ, ఆయన భార్య దేవికా రాణికీ దక్కింది. ఆ జంట సినిమా జీవితానికి భవిష్యత్తులో అది ఓ అద్భుతమైన అనుభవంగా పనికొచ్చింది. అయితే, అదే సమయంలో జర్మనీలో నాజీలు అధికారంలోకి రావడంతో ఆ అనుభవానికి అర్ధంతరంగా తెర పడింది.
హిందీ - ఇంగ్లీషుల్లో తొలి టాకీ
'బాంబే టాకీస్‌'ను నెలకొల్పడం కోసం భారత్‌కు తిరిగి రావడానికి ముందు హిమాంశు రారు మరో చిత్రాన్ని నిర్మించారు. దాని పేరే - 'కర్మ' (1933). హిందీ, ఇంగ్లీషు భాషల్లో తయారైన తొలి భారతీయ టాకీ అది. ఆ చిత్రం షూటింగ్‌ మొత్తం లండన్‌లోని స్టోల్‌ స్టూడియోస్‌లో జరిగింది. లొకేషన్‌ షూటింగ్‌ మాత్రం భారతదేశంలో చేశారు. ఆ చిత్రంలో దేవికారాణి, హిమాంశు రారు, బుర్‌ద్వాన్‌ మహారాణి సుధారాణి నటించారు. నటిగా దేవికా రాణికి అదే తొలి చిత్రం.

ఐరోపాలోని కొన్ని ప్రముఖ స్టూడియోలతో ఈ చిత్రాల సహ - నిర్మాణ సమయంలో హిమాంశు రారు ఎంతో విస్తారమైన అనుభవం గడించారు. దాంతో, 1934లో స్వయంగా 'బాంబే టాకీస్‌'ను స్థాపించినప్పుడు ఆయన దృఢంగా నిలబడగలగడానికి అవి తోడ్పడ్డాయి. బాంబే టాకీస్‌ను ఉమ్మడి స్టాక్‌ కంపెనీగా ఆయన ప్రారంభించారు. 'వెస్ట్రన్‌ స్టూడియోస్‌' లాగానే ఈ సంస్థలోని డైరెక్టర్ల బోర్డులో కూడా ఎంతోమంది ప్రముఖులు, ప్రసిద్ధ వ్యాపారవేత్తలు ఉండేవారు. భారతదేశంలో చిత్ర నిర్మాణాన్ని అనారోగ్యకరమైన పెను జూదంగా భావిస్తూ, భారీ పెట్టుబడికి తగని రంగంగా పరిగణిస్తున్న ఆ రోజుల్లో ప్రముఖ వ్యాపారవేత్తలు సభ్యులుగా నిలవడం చెప్పుకోదగ్గ విషయమే.
నిజానికి, 1930ల నాటి తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేక చాలామంది సినీ వ్యాపారాన్ని వదిలేశారు. ఆసియా ఉపఖండంలోనే అతి పెద్ద గొలుసుకట్టు చలనచిత్ర పంపిణీ సంస్థ అయిన 'మదన్‌ థియేటర్స్‌' సైతం అంతర్జాతీయ షేర్‌ విపణి వాల్‌స్ట్రీట్‌ కుప్పకూలిపోవడంతో, 1929లో దివాళా తీసింది. కానీ, హిమాంశు రారు మాత్రం తన వ్యాపారదక్షతతో నిలదొక్కుకున్నారు. సహ - నిర్మాణాల విషయంలో ఆయన అనుభవం, సినిమాలకు జాతీయ మార్కెట్‌ విషయంలో ఆయన ఆలోచనా ధోరణి సమకాలీనులకు భిన్నంగా ఉండేది. ఐరోపా మార్కెట్‌లోకి ప్రవేశించడం వల్ల క్లిష్టమైన పరిస్థితులను తట్టుకోవడమే కాక, 'బాంబే టాకీస్‌' ఏర్పాటుకు సైతం హిమాంశు రారు పునాది వేయగలిగారు.
భారతీయులకు శిక్షణతో 'బాంబే టాకీస్‌' చరిత్ర
బొంబాయి శివార్లలో ప్రశాంతంగా ఉండే చిన్న గ్రామమైన మలాడ్‌ గ్రామంలో హిమాంశు రారు 'బాంబే టాకీస్‌' పేర చక్కటి స్టూడియోను నెలకొల్పారు. మునుపటి చిత్రాల సందర్భంగా తాను కలసి పని చేసిన జర్మన్‌ సహ సినీ సాంకేతిక నిపుణుల సహాయం కూడా చిత్ర నిర్మాణ లేబొరేటరీని నిర్వహించడం కోసం హిమాంశు రారు తీసుకున్నారు. భారతీయ సాంకేతిక నిపుణులకు శిక్షణనివ్వాలనే స్పష్టమైన అవగాహన కుదుర్చుకొని, వీరందరినీ ఇక్కడకు తీసుకురావడం జరిగింది. వచ్చినవాళ్ళు ఆ పని చేశారు. దేశం నలుమూలలకు చెందిన ప్రతిభావంతులైన యువ పట్టభద్రులకు ఎంతోమందికి శిక్షణనిచ్చారు. అలా శిక్షణ పొందినవారిలో కె.ఎ. అబ్బాస్‌, అశోక్‌ కుమార్‌ గంగూలీ తదితరులు చాలా మందే ఉన్నారు. ఇక, లండన్‌లోని ప్రసిద్ధ రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమటిక్‌ ఆర్ట్‌లో చదువుకొని, ఆ తరువాత మ్యాక్స్‌ రీన్‌హార్డ్‌ వద్ద పాఠాలు నేర్చుకున్న అనుభవం ఉన్న దేవికా రాణి, కొత్త వారికి సహజ శైలి నటనలో తర్ఫీదునిచ్చారు.

'బాంబే టాకీస్‌' వారి చలనచిత్ర రూపకల్పనలోని ఇతర అంశాల్లో సైతం ఇదే విధమైన సహజత్వం చోటుచేసుకుంది. బాంబే టాకీస్‌ సాధించిన ప్రధాన విజయాల్లో ఒకటి - ఎంతో సరళమైన హిందుస్తానీ భాషను ప్రవేశపెట్టడం! వారి తొలి చిత్రం - 'జవానీ కీ హవా' (1935). దేవికా రాణి, నజ్‌ముల్‌ హుస్సేన్‌ నటించిన ఈ చిత్రాన్ని 'రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌' అభివర్ణించారు. అపరాధి ఎవరనే అంశం చుట్టూ తిరిగే ఈ నాటకీయ చిత్రం ఆదరణ చూరగొంది. హిమాంశు రారు భారతీయ చలనచిత్ర రంగానికి కొత్తదైన మరో పంథా తొక్కారు. సుదీర్ఘమైన ఒకే కథతో చలనచిత్రం రూపొందించే బదులు, రెండు చిన్న చిన్న కథలతో 'మమత', 'ఆల్వేస్‌ టెల్‌ యువర్‌ వైఫ్‌' ('మియా బీవీ') (1935) అనే రెండు వేర్వేరు చిన్న చిత్రాలు తీశారు. ఈ రెండు చిత్రాలనూ ఎంతో నైపుణ్యంతో రూపొందించినప్పటికీ, మూడు గంటల వ్యవధితో సాగే సుదీర్ఘమైన సినిమాలకు అలవాటు పడ్డ భారతీయ ప్రేక్షకులను ఈ చిన్న చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి.

అస్పృశ్యతపై ధ్వజమెత్తిన 'అఛూత్‌ కన్య', 'జీవన్‌ నయ్యా' హిట్టవడంతో, 'సంస్కరణవాదంతో కూడిన సాంఘిక కథాంశాలే మేల'ని హిమాంశు రారు గుర్తించారు. 'బాంబే టాకీస్‌' తదుపరి చిత్రం 'అఛూత్‌ కన్య' (1936) ఆ సంస్థ కీర్తి కిరీటంలో కలికితురాయి. భారతదేశంలోని కుల వ్యవస్థలో ఉన్న క్రూరత్వాన్ని ఆ చిత్రం కళ్ళకు కట్టింది. విప్లవాత్మకమైన ఆ చిత్ర కథాంశం వివాదం సృష్టించడమే కాక, విజయాన్ని కూడా అందించింది. ఆ సినిమాను కేవలం 8 వారాల్లో నిర్మించారు. దానికి అయిన ఖర్చు కూడా లక్ష రూపాయలకు లోపలే అని పరిశీలకుల భోగట్టా. అలాంటి చిత్రం బాక్సాఫీసు వద్ద చరిత్ర సృష్టించింది.

రెండో ప్రపంచ యుద్ధం 'బాంబే టాకీస్‌'పై దుష్ప్రభావం చూపింది. ఆ సంస్థకు చెందిన జర్మన్‌ సాంకేతిక నిపుణులందరినీ బ్రిటీషు వారు తమ దగ్గర శిబిరాల్లో బందీలుగా ఉంచేశారు. అప్పట్లో హిమాంశు రారు చిత్ర నిర్మాణంలోని ప్రతి విభాగాన్ని స్వయంగా పర్యవేక్షించేవారు. అలా మితిమీరి పనిచేయడం హిమాంశు రారు ఆరోగ్యంపై ప్రభావం చూపింది. దాంతో, ఓ గొప్ప సంస్థను నెలకొల్పిన అయిదేళ్ళకాలానికే, పదిహేను చిత్రాల నిర్మాణంతోనే నరాలు దెబ్బతిని, 1940 మే 19న హిమాంశు రారు మరణించారు. మరణించేనాటికి ఆయన వయస్సు 48 ఏళ్ళే! ఆయన మరణం తరువాత 1945 వరకు దేవికా రాణి పర్యవేక్షణలో 'బాంబే టాకీస్‌' పతాకంపై చిత్ర నిర్మాణం సాగింది. కానీ, ఆ పైన ఆమె స్టూడియోను వదిలేసి, రష్యన్‌ చిత్రకారుడు డాక్టర్‌ స్వెతొస్లావ్‌ రోరిచ్‌ను వివాహం చేసుకొన్నారు. మరికొన్నేళ్ళు 'బాంబే టాకీస్‌' పైన చిత్ర నిర్మాణాలు జరిగినా, ఆఖరి చిత్రం 'బాద్‌బాన్‌' (1954)తో ఆ సంస్థ కనుమరుగైంది.

ఏమైనా, భారతీయ చలనచిత్ర చరిత్రలో హిమాంశు రారుది ప్రత్యేక అధ్యాయం. భారతీయ చలనచిత్రాల మార్కెట్‌ను విస్తృతమైన దృష్టి కోణంతో చూసిన ఔత్సాహికుడిగా ఆయన గుర్తుండిపోతారు. ప్రసిద్ధ విదేశీ చిత్ర నిర్మాణ సంస్థలతో కలసి కో-ప్రొడక్షన్స్‌గా భారతీయ చిత్రాలు తయారవుతున్న ఈనాటి ఆలోచనకు మూకీల రోజుల్లోనే ఆయన ఆద్యుడు. అదే ఆయనను చిరస్మరణీయుణ్ణి చేసింది.
- రెంటాల జూనియర్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి